యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

UPSC Civil Services Exam 2024.. Notification Released

న్యూఢిల్లీః ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కోసం సన్నద్ధమవుతున్న యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ నేడు (ఫిబ్రవరి 14, 2024) ప్రారంభమైంది. మార్చి 5, 2024 అప్లికేషన్లకు చివరి తేదీగా ఉంది. upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్లను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యాసంస్థల్లో డిగ్రీ లేదా సమానమైన కోర్సు పూర్తి చేసినవారు దరఖాస్తుకు అర్హులు అవుతారు. జనరల్ అభ్యర్థులు గరిష్ఠంగా ఆరుసార్లు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాయొచ్చు. అయితే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, వికలాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఆశావహులు అపరిమిత సంఖ్యలో ప్రయత్నించవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు ప్రయత్నించవచ్చు. వికలాంగ కేటగిరికి చెందిన జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు గరిష్ఠంగా 9 సార్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ప్రిలిమినరీ పరీక్షలో ఏదైనా ఒక పేపర్‌ పరీక్ష రాస్తే ఒక ప్రయత్నం చేసినట్టుగా పరిగణిస్తారు.

వయసు విషయానికి వస్తే కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. ఇక ఆగస్టు 1, 2023 నాటికి వయసు 32 సంవత్సరాలు నిండినవారు అర్హులు కాదు. అంటే ఆగస్టు 1, 2023 నాటికి 32 సంవత్సరాలు దాటకూడదని యూపీఎస్సీ నిబంధనలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే అభ్యర్థులు ఆగస్టు 2, 1991 కంటే ముందు.. ఆగష్టు 1, 2002 తర్వాత జన్మించి ఉండకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, కేటగిరీలను బట్టి మరికొందరికి సడలింపు ఉంటాయి. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసు కోసం ప్రయత్నించే అభ్యర్థులు కచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి.