పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు

Unstable conditions in West Asia
Unstable conditions in West Asia

ఇటీవల పశ్చిమాసియా కేంద్రంగా పెరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు మూలంగా ప్రపంచదేశాల దృష్టి ఈ ప్రాం తంపై పడింది. ఒకవైపు ఇరాక్‌ మరోవైపు అమెరికాలు నువ్వా- నేనా అన్నట్టు తలపడటం ద్వారా ఆప్రాంతంలో శాంతికి విఘాతం కలగడమేకాకుండా దాని పర్యావసానాలు అనేక దేశాలపై నేరుగా పడేవీలుంది.

భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న ఈ ప్రాంతంపై పట్టుకోసం అటు అమెరికాతోపాటుగా ఇజ్రాయిల్‌, ఇరాన్‌, సౌదీ అరేబియాలు ప్రయత్నిస్తూ ఉండటంతో ఇది ఆధి పత్య పోరుకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి దేనికైనా తెగించే అమెరికా ఆయా దేశాల ప్రభుత్వాలను అస్థిరపరిచి తమ అదుపుఆజ్ఞలకు లోబడే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే తన విదేశాంగ విధా నపు లక్ష్యంగా పెట్టుకోవడం విషాదకరం. 1979నాటి ఇరాన్‌ విప్ల వంనుండి మొదలైన ఇరాన్‌- అమెరికా శత్రుత్వం నేడు తారా స్థాయికి చేరింది. ఆనాటి నుండి ఇరాన్‌ పాలకులు అవలభించిన విధానాలు కూడా ఈ పరిస్థితికి కొంతకారణంగా చెప్పవచ్చు. సోవి యెట్‌ పతనమయ్యాక తమ ఆధిపత్యానికి ఇక తిరుగు ఉండదని భావించిన అమెరికా ప్రపంచంలో వస్తున్న సవాళ్లను స్వీకరించ డానికి సిద్ధంగా లేదు.

తమ చెప్పుచేతల్లో లేని ప్రపంచదేశాలను సామ,ధాన,బేధ దండోపాయాలను ఉపయోగించి ఆయా దేశాలను లొంగదీసుకుంటుంది. ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని లెక్క చేయకుండా ప్రజాస్వామ్యపరిరక్షణ పేరుతో ఆయాదేశాల అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకొని అస్థిరపరిస్థితులు రాజేస్తుంది. సోవియెట్‌ వ్యాప్తిని అడ్డగించాలనే కారణంతో ఆప్ఘనిస్థాన్‌లో అనేక తీవ్రవాద గ్రూపులకు సైనిక శిక్షణ ఇచ్చి నిధులు, ఆయుధాల సర ఫరా చేసిన ప్రయత్నాల మూలంగానే నేడుఅక్కడ అహింస, అరా చక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.

ఒకవైపు సౌదీ అరేబియా ద్వారా చాందసవాద శిక్షణ మరోవైపు అమెరికా అందించిన రక్షణ సదుపాయంతో ఉగ్రవాద మూకలు రెచ్చిపోతున్నాయి. నేడు మనం మాట్లాడుకుంటున్న ఆల్‌-ఖైదా, ఐసిస్‌ వ్యాప్తికి పరోక్షంగా సహా యం చేసింది అమెరికానే అనటంలో ఎటువంటి సందేహం లేదు. చమురు, గ్యాస్‌ వంటి విలువైన సంపదకు కేంద్రంగా ఉన్న పశ్చి మాసియా ప్రాంతం అనేక వైరుధ్యాలకు నెలవ్ఞ. రాజకీయంగా, మతపరంగా అనేక సంక్లిష్టతలు ఈ ప్రాంతంలో మనకు కనిపి స్తాయి. ఇస్లాంలోని సున్నివర్గానికి సౌదీ నేతృత్వం వహిస్తుంటే షియా వర్గానికి ఇరాన్‌ నాయకత్వ బాధ్యతను తీసుకుంది.

రాను రాను ఇది ఆధిపత్యపోరుగా మారి అనేక దేశాలు రావణకాష్ఠంగా మారడానికి కారణమైంది. సౌదీ పాలకులకు అండగా ఉండి అమెరికా తమ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఇరాన్‌ భావించగా, హెజ్‌బుల్లా వంటి తీవ్రవాద గ్రూపులకు చేయూతనం దించి ఇరాన్‌ తమ మిత్ర దేశాలను ఇబ్బందులకు గురి చేస్తుందని సౌదీ భావించసాగింది. పైగా ఆయా దేశాల్లో ఏర్పడిన మిలటరీ ప్రభుత్వాలు, రాచరిక ప్రభుత్వాల ప్రగతి నిరోధంగా మారి తీవ్ర వాద పెరుగుదలను పోషించాయి. ఒకరిపై మరొకరు కాలుదువ్ఞ్వ కుంటూ ఆ ప్రాంత శాంతి సుస్థిరతలకు భంగం కలిగించాయి.

ఇరాక్‌ను పాలించిన సద్దామ్‌హుస్సేన్‌ వంటి మిలటరీ అధికారుల పాలనలో ఈ వర్గాల మధ్య కుమ్ములాటను అణచివేసినా అంత ర్లీనంగా ఉన్న వర్గవైషమ్యాలు ఆ పాలన అంతమవగానే మరలా ఊపిరి పోసుకున్నాయి. స్థిరమైన పాలన లేకపోవడం శాంతిభద్ర తలు పతమనమవడంతో ఇటీవల కాలంలో ఐసిస్‌ రూపేణా మరో తీవ్రవాద గ్రూపు ముందుకువచ్చింది. ఐసిస్‌ను నిర్మూలించే కార్య క్రమంలో ఇరాన్‌, అమెరికా, సిరియా, రష్యా వంటి దేశాలు సహ కరించుకున్నా ఆ పోరు ముగియగానే వీరిమధ్య విబేధాలుముందు కు వచ్చాయి.

సిరియాలోని అసద్‌ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే అమెరికా ప్రయత్నిస్తుంటే అసద్‌కు మద్దతుగా రష్యా, ఇరాన్‌లున్నా యి. యెమెన్‌లోని ప్రభుత్వానికి సౌదీ సహాయసహకారాలు అంది స్తుంటే అక్కడి శత్రువర్గమైన హతీలకు ఇరాన్‌ బాసటగా ఉంది. ఇరాక్‌లోని షియా తీవ్రవాద గ్రూపులని ఉపయోగించి ఇరాన్‌ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుందనే భయం ఏనాటి నుంచో సౌదీ అరేబియా అమెరికాను వెంటాడుతుంది. ప్రస్తుత కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరించిన విధానాలు వాటికి మరింత తోడ్పాటును అందించాయి.

గత ఎన్నికల్లో అమెరికాను మరోసారి ఉద్రిక్తతలకు గొప్ప మారుస్తానని చేసిన ప్రకటనలు నేడు అక్కడి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మతబూచిని చూపి, వలసలను అమెరికాలోని సమస్యలకు కారణంగా చూపి గద్దెనెక్కిన ట్రంప్‌ అనేక అంతర్జాతీయ ఒప్పందాల నుండి బయటకు రావడం ద్వారా వాటికి ఉండే విలువలను ప్రశ్నార్థకంగా మార్చేశారు.

ఏక పక్షంగా ఇరాన్‌తో అమెరికా సహా ఐరోపాసమాఖ్య,ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యా, చైనా,యు.కె కుదుర్చుకున్న జాయింట్‌ కంప్రెహిన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (జెసిపిఓయే) నుండి వైదొలగడంలో దాని అమలుపై నీలినీడలు కమ్మాయి.అమెరికాని బుజ్జగించేస్థాయిలో ఐరోపా సమా ఖ్యలేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొనిఉంది. ఒప్పం దంలో భాగంగా తమపై ఎన్నోఏళ్లుగా ఉన్నఆంక్షలు తొలగిపోతా యనుకున్న ఇరాన్‌కు ట్రంప్‌వైఖరి లేనిపోని చిక్కులనుతెచ్చిపెట్టింది. దీనికిబదులుగా తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని మరలా మొద లుపెడతామని ఇరాన్‌స్పష్టం చేయడంతో ఒప్పందంలో భాగంగా ఉన్న దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

అణ్వాయుధాలు లేని కారణంగానే ఆనాడు అమెరికా ధైర్యంగా లిబియాలో గడాఫీ, ఇరాక్‌లో సద్దామ్‌హుస్సేన్‌లను గద్దెదించిందనే భావన ఇరాన్‌ పాలకుల్లో గట్టిగా ఉంది.వీటన్నింటితోపాటు ఐసిస్‌పై యుద్ధంలో అమెరికాకు సహాయికారిగా ఉన్న కుర్థులసమస్య ప్రశ్నార్థకంగా ఉంది. అనేక దేశాల మధ్య చీలిపోయిన కుర్థులు తమ సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా పోషించే పాత్రపైనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇరాన్‌,ఇరాక్‌, సిరియా,టర్కీవంటి దేశాలవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైనార్టీలైన కుర్ధులపై ఆయా దేశాల పాలకులు ఉక్కుపాదం మోపు తున్నాయి.

వీటన్నింటితోపాటు ఇటీవలే జరిగిన పరిణామాలు అమెరికా – ఇరాన్‌ల మధ్య యుద్ధం ముంచుకు వస్తుందా అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి.ఇరాక్‌ను సైనికశక్తిగా మరల్చడంలో కీలక భూమిక పోషించిన ఖాసింసులేమాని హత్యతో ఎలాగైనా పగతీర్చు కోవాలని ఇరాన్‌జరిపిన మెరుపుదాడులతో సమస్య తీరిపోతుందని చెప్పలేం.

ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ ప్రాంతం అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.కనుక చమురు దిగుమతులపై ఆధారపడ్డ దేశాలకు ఇబ్బందులు ఎదురవ్ఞతాయి.ఇరాకీ పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయంతో అమెరికా దళాలు వైదొలిగితే ఐసిస్‌ ఉగ్ర వాదులు తిరిగి తమకార్యకలాపాలు ప్రారంభించేవీలుంది. అమెరికా సైనికదళాలు వైదొలిగే ప్రక్రియకు చట్టబద్ధరూపం ఇవ్వాలంటే మరీ కొంత సమయం పడుతుంది.కనుక ఇరాక్‌లోని అమెరికా స్థావరాల ను లక్ష్యంగాచేసుకొని ఇరాన్‌ మరిన్నిదాడులు చేయవచ్చు. ప్రతీకార దాడులకు తెగబడితే ఇరాన్‌లోని సాంస్కృతిక,చారిత్రక కట్టడాలను మట్టికరిపిస్తామని ట్రంప్‌ అనడం తన అవగాహనలేమికి నిదర్శ నం. అస్థిర పరిస్థితులే ఉగ్రవాదానికి మూలకారణం.

  • సముద్రాల వి.కె

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/