కాంగ్రెస్ అగ్రనాయత్వంపై గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు
ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్వం పనితీరు పేలవంగా ఉంది..

న్యూఢిల్లీః డెముక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్వం పనితీరు పేలవంగా ఉందని విమర్శించారు. పార్టీలో ప్రజాస్వామ్య ప్రక్రియకు తావులేదని, అపాయింట్‌మెంట్ కల్చర్ పెరిగిందని ఆరోపించారు. ఇందిరా గాంధీ వ్యవహార శైలి మెరుగ్గా ఉండేదని, యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా తాను ఆమెను ఎంతో దగ్గర నుంచి గమనించే అవకాశం లభించిందని ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీని అప్పట్లో మీరు ఏ సమయంలోనైనా కలిసే అవకాశం ఉండేదని, ఇప్పుడు పార్టీ అగ్రనాయకత్వాన్ని సంప్రదించే పరిస్ధితి లేదని వాపోయారు. తాను బిజెపి బీ టీంగా వ్యవహరిస్తున్నానని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆజాద్ తోసిపుచ్చారు. బిజెపిని నిలువరించేందుకు కాంగ్రెస్ చేస్తున్నదేమీ లేదని బిజెపి ఎదుగుదలకు కాంగ్రెస్ దోహదపడిందని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో తన సంబంధాలపై బదలిస్తూ పలు వివరాలు వెల్లడించారు. రాహుల్ చేసిన పలు పొరపాట్లకు పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నేత హిమంత బిశ్వ శర్మ పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో ఉండగా ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని చెప్పారు. శర్మ తిరుగుబాటు వ్యవహారాన్ని తాను రాహుల్కు వివరించగా ఆయనను బయటకు వెళ్లనివ్వండని నిర్లక్ష్యంగా అన్నారని ఆజాద్ గుర్తుచేసుకున్నారు. ఆపై కాంగ్రెస్ ముఖ్య వ్యూహకర్త, ట్రబుల్ షూటర్ శర్మ పార్టీని వీడి బిజెపిలో చేరి అసోం సీఎం అయ్యారు.