కేసీఆర్ జాతీయ పార్టీ ఫై ఉండవల్లి కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయినసంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత రాజకీయాల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ కావడం తో వీరిద్దరూ ఏమాట్లాడుకున్నారో అని అంత ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఈ తరుణంలో సోమవారం ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పటు చేసి కేసీఆర్ తో భేటీ విషయాలను తెలిపారు.

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 10 రోజుల క్రితమే ఫోన్‌ చేసి ఆహ‍్వానించారు. జాతీయ పార్టీ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. బీజేపీ గురించి నా అభిప్రాయం, కేసీఆర్‌ అభిప్రాయం ఒక్కటే. బీజేపీ అంటే వ్యక్తిగతంగా నాకేమీ వ్యతిరేకత లేదు. విధానాలపరంగానే విమర్శిస్తాను. రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుని సంతోషంగా ఉన్నాను. రాజకీయాల్లో కొనసాగే ఆసక్తిలేదని కేసీఆర్‌తో చెప్పాను. బీజేపీ వ్యతిరేకులను ఏకంచేసే శక్తి కేసీఆర్‌కు ఉంది. మా భేటీలో బీఆర్‌ఎస్‌ గురించి ప్రస్తావన రాలేదు. కాంగ్రెస్‌ వీక్‌ అవుతుంది కాబట్టి.. బీజేపీకి గట్టి కౌంటర్‌ అటాక్‌ ఇవ్వాలి. బీజేపీ వైఖరి వల్ల అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట దెబ్బతోంటోంది. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన తాఖీదులతో దేశ గుడ్‌ విల్‌ దెబ్బతింటోంది. బీజేపీ పాలనలోని లోపాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు లేరు.

ఇటీవల బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ కామెంట్స్ వల్ల ఇస్లామిక్ దేశాల్లో ఎంతటి వ్యతిరేకత వచ్చిందో వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒక దేశంతో మరొక దేశం ఎంత ఆధారపడి ఉందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న చర్యల వల్ల దేశానికి ఎంతటి నష్టముందో వివరించారు.

ఈ దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు కేసీఆర్ పెద్ద అభిమాని అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ దేశానికి నెహ్రూ ఆలోచనా విధానంపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. బీజేపీ విధానాలకు, ఐడియాలజీపై కేసీఆర్ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. మత పరంగా బీజేపీ అవలంభిస్తున్న విధానాలపై మరింతగా గళమెత్తాలని కేసీఆర్ తనకు సూచించారని చెప్పారు. ఇక ఏపీలో బీజేపీని ఎవరూ వ్యతిరేకించడం లేదని.. జగన్, పవన్, చంద్రబాబు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారో జనానికి తెలియదా అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయానన్న అరుణ్ కుమార్.. త్వరలోనే అన్ని విషయాలను కేసీఆర్ వెల్లడిస్తారని స్పష్టం చేశారు.