టర్కీలో భారీ భూకంపం..24కు చేరిన మృతుల సంఖ్య

కుప్పకూలిన భవనాలు.. ధ్వంసమైన రోడ్లు

టర్కీలో భారీ భూకంపం..24కు చేరిన మృతుల సంఖ్య
Major Earthquake Hits Greece, Turkey

ఇస్తాంబుల్‌: టర్కీలో శుక్రవారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.0గా దీని తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి టర్కీలో స్వల్పంగా సునామీ వచ్చింది. రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్ దేశాల్లో ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. 419 మంది గాయపడ్డారు.

భూకంపం ప్రభావం టర్కీలోని ఇజ్మీర్ పట్టణంపై తీవ్రంగా పడింది. అక్కడ పలు భవనాలు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింది. శిథిల భవనాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని, కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 70 మందిని రక్షించినట్టు చెప్పారు. గ్రీస్‌లోని సామోస్ ద్వీపానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

భూకంప తీవ్రత ఇజ్మీర్‌లో ఎక్కువగా ఉంది. ఇక్కడ 10కిపైగా భవనాలు కుప్పకూలగా, మరిన్ని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అంబులెన్సులు, హెలికాప్టర్లు, వైద్య బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయి. సామోస్ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూరోపియన్‌జమెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ ప్రకటించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించడంతో ప్రకంపనలు మరికొన్ని వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని గ్రీస్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్ సెలెంటిస్ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/