విగ్రహారాధన

OM
OM

నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని కోటానుకోట్ల మందిలో ఏ కొద్దిమందో అర్ధం చేసుకుని తగిన విధంగా ఆరాధించగలరు. అత్యధికులకు నామ, గుణ, రూపం ఉన్న భగవంతుడు కావలసిందే. పూర్ణజ్ఞాని, పూర్ణశుంఠ కాక మరెవ్వరైనా ‘నాకు నామరూపాలు లేని దేవుడే కావాలి నేను పూజించటానికి అని అంటే వాడు కపటి అన్ని, వాని పట్ల కడు జాగ్రత్తగా ఉండాలంటాడు వివేకానందస్వామి. ‘నేను అని అన్నప్పుడు ఎవనికైతే వాని శరీరము గుర్తురాదో ‘దేవుడుని గూర్చి భావించినప్పుడు ఈ చరాచర ప్రపంచము స్ఫురించదో, వాడే విగ్రహారాధకుడు కాడు. ఇతరులంతా వారు ఎంత పండితులైనా, ఎన్ని మాటలు చెప్పినా విగ్రహారాధకులే. విగ్రహ రూపాలు మారొచ్చు, వాటి కొలతలు మారొచ్చు. వారు విగ్రహారాధకులన్న విషయం వారికే తెలియకపోవచ్చు. శ్రీరామకృష్ణ పరమహంస విగ్రహారాధకుడే, ఆయన అడుగు జాడల్లో నడచిన ఆయన శిష్యులు అందరూ విగ్రహారాధకులే. వారందరూ ఈ ప్రపంచానికి సేవ చేసినవారే. అయితే వారెవరూ సాధారణ భక్తులు కారు. విగ్రహాలలోకి దైవాన్ని దింపి సంభాషించిన భక్తాగ్రేసరులు వారు. ఏ నిరూపణలు లేక చెబుతున్న విషయం కాదిది. ఎన్నో ఖచ్చితమైన రుజువులున్నాయి, సంఘటనలున్నాయి. రామేశ్వరానందస్వామి తన అనుభవాన్ని ఇలా చెబుతాడు: నేను మందిరంలో పూజ చేస్తుండగా ప్రేమానాందస్వామి నన్ను ఈ విధంగా అడిగారు : గురుదేవుల వస్త్రాలు బాగున్నాయా? నాయనా! జాగ్రత్తగా చూడు! ఒక కొత్త వస్త్రాన్ని గురుదేవులకు సమర్పించి, అది నేను వేసుకోబోతుంటే, గురుదేవులు నాకు కనిపించి ‘బాబూరాం, నువ్వు కొత్త వస్త్రం ధరించబోతున్నావు. నా చొక్కా చినిగిపోయి ఉన్నది. నువ్వు నన్నిప్పుడు ప్రేమించటం లేదా? అన్నారు. అప్పుడు మేమిద్దరం మందిరానికి వెళ్లి చూస్తే గురుదేవుల చొక్కాను ఎలుకలు కొరికినవి. ఇప్పుడు చెప్పండి వారు ఆరాధించినది నిర్జీవమైన విగ్రహాన్ని లేక విగ్రహరూపంలో ఉన్న రామకృష్ణుడినా? ప్రేమానందస్వామి పూరి వెళ్లినప్పుడు ఆలయం ముందర ఒక క్రైస్తవ మతప్రచారకుడు నిలబడి బిగ్గరగా హిందూమతాన్ని ఖండించటాన్ని చూశాడు. దాన్ని భరించలేక ప్రేమానందస్వామి గట్టిగా ‘హరిబోల్‌, ‘హరిబోల్‌ అంటూ భగవన్నామ స్మరణ చేశాడు. అక్కడున్న జనమంతా వారి గొంతు కలిపారు. క్రైస్తమ మత ప్రచారకుడి స్వరం చిన్నబోయి వెళ్లిపోయాడు. ఆ రాత్రి రామకృష్ణులు ఆయనకు కలలో కనబడి ‘నువ్వా జనసమూహాన్ని ఎందుకు చెదరగొట్టావు? ఆ క్రైస్తవ మత ప్రచారకుడు కూడా నా నామాన్నే, బోధనలనే ప్రచారం చేస్తున్నాడు. రేపు నువ్వు అతణ్ణి ఎలాగైనా వెదకి పట్టుకుని క్షమాపణ అడుగు అని చెప్పాడు. ప్రేమానందస్వామి ఆ మరునాడు వెదకి, వెదకి ఆ క్రైస్తవ మత ప్రచారకుని ఇల్లు కనుగొని సవినయంగా క్షమాపణ కోరాడు. మరి అలాంటి వ్యక్తి రామకృష్ణ ఆలయంలో ఉన్నది నిర్జీవమైన శిల అనుకొంటాడా లేక సాక్షాత్తు తన గురుదేవులే అనుకొని పూజిస్తాడా? మనము శిలావిగ్రహంలో దైవాన్ని చూసి, నూటాతొంభైయ్యారు కోరికలు అర్హతకు మించినవి కోరి, బయటికి వచ్చి పక్షిని, పశువును, సాటి మనిషిని హీనంగా చూస్తే మనది భక్తి అవుతుందా, మనకు భగవంతుడు పలుకుతాడా? మన ప్రవర్తన వల్ల భగవంతుడు పారిపోతాడు.
– రాచమడుగు శ్రీనివాసులు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/