ఐక్యరాజ్యసమితిలో ‘డైనోసార్’ సందేశం

శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలని హితవు

ఐరాస: ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వసభ్య సమావేశం కావెర్‌నోస్‌ హాల్‌లో జరుగుతున్నది. 193 దేశాల అధినేతలు హాజరయ్యారు. ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు. ఇంతలో హాల్‌ తలుపు దగ్గర పెద్ద శబ్దం. అందరూ అటు చూశారు. ఓ భారీ డైనోసార్‌ నడుచుకొంటూ వస్తున్నది. అందరూ ఉలిక్కిపడ్డారు. ఏడు కోట్ల ఏండ్ల క్రితం అంతరించిపోయిన డైనోసార్‌ మళ్లీ కనిపించడంతో ఆశ్చర్యపోయారు. డైనోసార్‌ నేరుగా పోడియం దగ్గరకు వెళ్లింది. మైక్‌ దగ్గర నిలబడింది. మానవాళిని ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టింది. అప్పటిదాకా భయంతో, ఆశ్చర్యంతో బిగుసుకుపోయిన దేశాధినేతలంతా వెంటనే హెడ్‌ సెట్‌లను ధరించారు. అది ఏం చెప్తుందోనని ఆసక్తిగా వినడం ప్రారంభించారు. ‘మానవులారా.. మీరు పర్యావరణ విపత్తు వైపు వెళ్తున్నారు.

శిలాజ ఇంధనాలపై సబ్సిడీ కోసం ప్రభుత్వాలు ఇంకా ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. ఈ ఏడు కోట్ల ఏండ్లలో నేను విన్న తెలివి తక్కువ విషయం ఇదే. ఇది మీ వినాశనానికి దారితీస్తుంది. మా జాతి ఉల్కల వల్ల అంతరించింది. మేం అంతరించిపోవడానికి కనీసం ఒక్క కారణం ఉంది. కానీ మీరు.. మీకు మీరే అంతం చేసుకొంటున్నారు. ఆలస్యం కాకముందే ఇకనైనా మేలుకోండి. వినాశనాన్ని ఎంచుకోకండి. మార్పును మొదలు పెట్టండి’ అని డైనోసార్‌ పిలుపునిచ్చింది. ఇది విన్న దేశాధినేతలంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి డైనోసార్‌ను అభినందించారు. పర్యావరణ మార్పులపై అవగాహన కోస ఐరాస రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ ఇది. ఐరాస చేపట్టిన ‘వినాశనాన్ని ఎంచుకోకండి’ అనే క్యాంపెయిన్‌లో భాగంగా దీన్ని ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/