అదే తేదీన యుద్ధాన్ని ముగించాలన్న ఆలోచనలో రష్యా!

మే 9న రష్యాకు విజయోత్సవ దినం..ఉక్రెయిన్ సైనిక వర్గాల అంచనాలు

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరంభించి నెల రోజులు దాటిపోయింది. ఉక్రెయిన్ విధానాలు తన దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉన్నాయంటూ రష్యా ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పటికీ రష్యా సేనలు ఉక్రెయిన్ పై పోరాడుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్ ఇంకా సొంతం కాలేదు. కొన్ని పట్టణాలను, అణు కర్మాగారాలను స్వాధీనం చేసుకోగలిగింది. ఉక్రెయిన్ బలగాలు సైతం గట్టిగానే పోరాడుతున్నాయి. ఈ యుద్ధానికి అంతం ఎప్పుడు? అందరి మనసుల్లో మెదులుతున్న సందేహం ఇది.

అయితే మే 9న యుద్ధాన్ని ముగించాలన్నది రష్యా ఆలోచనగా ఉక్రెయిన్ సైన్యం చెబుతోంది. ఉక్రెయిన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కీవ్ ఇండిపెండెంట్ ఓ నివేదికను ప్రచురించింది. దీని ప్రకారం.. యుద్ధం కచ్చితంగా మే 9న ముగియాలని రష్యా దళాలకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. నాజీ జర్మనీపై రష్యా విజయం సాధించిన రోజు అది. మే 9న విజయోత్సవంగా రష్యా జరుపుకుంటుంది. ఉక్రెయిన్ సైనిక వర్గాల అంచనాలు నిజమవుతాయా? లేదా ఈ లోపే యుద్ధం ముగిసిపోతుందా? అన్నది చూడాల్సిందే.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/