బెంగుళూర్ వర్షాల ఫై మంత్రి కేటీఆర్ ట్వీట్

బెంగళూరు నగరం తడిసిముద్దవుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వరద పోటెత్తుంది. వందలాది కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తమైంది. ఇక నిన్న ఆదివారం రాత్రి బెంగళూరులో కుండపోతగా వర్షం కురిసింది. సీవీ రామన్ నగరంలో అత్యధికంగా 44 సెంటిమీటర్ల వర్షం కురవగా.. ఇతర ప్రాంతాల్లోనూ 20 నుంచి 30 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లోని తమ కంపెనీలకు రూ.225 కోట్ల నష్టం వాటిల్లిందని ‘బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌’ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాసింది. ఐటీ కార్యాలయాలు, బెంగళూరు ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులను, వరదలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ల మీద, పడవల్లో తరలిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బెంగుళూర్ వరదలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. గతంలో హైదరాబాద్‌కు వరదలు వచ్చిన సమయంలో బెంగళూరు నేతలు విమర్శలు చేసిన సంగతి గుర్తు చేస్తూ కీలక సూచనలు చేశారు.

‘మన నగరాలు రాష్ట్రాలకు ఆర్థిక ఇంజిన్ల లాంటివి. అవి దేశ వృద్ధిని నడిపిస్తాయి. అర్బనైజేషన్ (పట్టణీకరణ), సబ్-అర్బనైజేషన్ వేగవంతంగా జరుగుతున్న వేళ.. అందుకు తగినట్లు నగరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు తగినంత పెట్టుబడులు కేటాయించకపోతే మౌలిక వసతులు కుప్పకూలిపోతాయి’ అని ..‘పట్టణ ప్రణాళిక, నిర్వహణలో మనకు ధైర్యవంతమైన (Bold) సంస్కరణలు అవసరం. సంప్రదాయవాద మనస్తత్వం నుంచి బయలకు రావాలి. నాణ్యమైన రోడ్లు, నీరు, గాలి, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించడం పెద్ద కష్టమైన పని కాదు. అందుకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర హౌసింగ్‌, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చూసుకోవాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేసారు. పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం అంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ట్యాగ్ చేశారు.