అర్నబ్‌కు మరో దెబ్బ.. ఈసారి బ్రిటన్!

ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్నబ్ గోస్వామికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆయన కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శించడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా తాజాగా అర్నబ్ గోస్వామి హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ఊహించని షాక్ తగిలింది. బ్రిటిష్ టీవీ నియంత్రణ సంస్థ అయిన ఆఫ్‌కామ్ అర్నబ్‌కు రూ.19 లక్షల జరిమానా విధించింది. దీంతో అర్నబ్‌తో పాటు రిపబ్లిక్ టీవీ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

గతేడాది సెప్టెంబర్ 6న టెలికాస్ట్ అయిన ‘పూఛ్‌తా హై భారత్’ అనే కార్యక్రమంలో పాకిస్థాన్ దేశస్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు సదరు సంస్థ ఆరోపించింది. పాకిస్థాన్‌లో ఉంటున్న పిల్లలు, వృద్ధులతో సహా అందరూ తీవ్రవాదులే అనే ఉద్దేశ్యం వచ్చేలా అర్నబ్ గోస్వామి వ్యాఖ్యలు చేశారని ఆఫ్‌కామ్ ఆరోపణలు చేసింది. ఆ కార్యక్రమం నిర్వహించిన అర్నబ్‌తో పాటు అందులో పాల్గొన్న సభ్యులు క కూడా పాకిస్తానీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆ సంస్థ పేర్కొంది.

దీంతో అర్నబ్ గోస్వామితో పాటు రిపబ్లిక్ టీవీకి జరిమానా విధిస్తున్నట్లు బ్రిటిష్ టీవీ నియంత్రణ సంస్థ తెలిపింది. ఆ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లో మరోసారి ప్రసారం చేయవద్దంటూ ఆఫ్‌కామ్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి అర్నబ్ గోస్వామి టైమ్ చాలా బ్యాడ్‌గా ఉందని, అందుకే ఆయనకు ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.