టీవీ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

TV Actor Chandu Commits Suicide Following Co-Star Pavithra’s Accident

హైదరాబాద్‌ః త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం త్రినయని నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య పరిశ్రమలో విషాదం నింపింది. పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు.

ప్రమాదం తర్వాత మానసిక కుంగుబాటుకు గురైన చంద్రకాంత్ నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీలోని అల్కాపూర్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఫ్లాట్‌కు వచ్చి చూడగా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. చంద్రకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు. చంద్రకాంత్ తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, పవిత్ర జయరాంతో చందూ ఆరేండ్లుగా సహజీవనం చేస్తున్నట్టు చెప్తున్నారు. కర్ణాటకకు చెందిన వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారు. గత వారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందింది. ఆమెతోపాటు ఉన్న చందూ గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ‘ఆమె నన్ను పిలుస్తున్నది’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు.