భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్​పై స్పందించిన టీటీడీ ఛైర్మన్ భూమన

అటవీ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామన్న భూమన

ttd-chairman-respond-to-trolls-on-social-media

తిరుమలః తిరుమల అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రలు పంపిణీ చేయాలన్న టీటీడీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ భూమన కరుణాకర్‌‌రెడ్డి స్పందించారు. ట్రోల్స్‌ను ఖండించిన ఆయన.. అటవీ శాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి భూమన పరిశీలించారు. కర్రలు ఇచ్చి, బాధ్యతల నుంచి టీటీడీ తప్పుకుంటున్నదని ట్రోల్స్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బోనులో చిక్కిన మగ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని తెలిపారు. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటున్నారని.. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టినట్లు చెప్పారు.