తెలంగాణలో రేపటి నుంచి అద్దెబస్సుల సమ్మె

ఉచిత ప్రయాణాం..రద్దీ పెరగడం వల్ల బస్సులు పాడవుతున్నాయని ఆందోళన

tsrtc-rent-bus-drivers-going-to-strike-from-tomorrow

హైదరాబాద్‌ః మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి తర్వాత ఆర్టీసీలోని అద్దెబస్సుల యజమానులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రయాణికుల రద్దీ పెరగడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతుండడం వల్ల బస్సులు పాడవుతున్నాయని, కేఎంపీఎల్ పడిపోయిందని ఫలితంగా బస్సుల నిర్వహణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.

సమస్యలు పరిష్కరించకుంటే జనవరి 5 నుంచి సమ్మెకు వెళ్తామని ప్రకటించారు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో ముందుగా హెచ్చరించినట్టుగానే రేపటి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. అదే జరిగితే, బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,700 అద్దె బస్సులు నడుస్తుండగా ఒక్క హైదరాబాద్‌లోనే 300 బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. నిన్నటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.