‘రిపబ్లిక్’ చిత్ర నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన కొల్లేరు గ్రామస్థులు

ఇప్పటికే ‘రిపబ్లిక్’ చిత్ర విడుదల సమయంలో హీరో ప్రమాదానికి గురి కావడం..సినిమా ఓపెనింగ్స్ పెద్దగా లేకపోవడం..కలెక్షన్లు దారుణంగా ఉండడం ఇలా వరుస ఇబ్బందుల్లో నిర్మాతలు ఉంటే…ఇప్పుడు వీరికి మరో సమస్య వచ్చిపడింది. ‘రిపబ్లిక్’ చిత్ర నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలంటూ కొల్లేరు గ్రామస్థులు రోడ్డెక్కారు. రిపబ్లిక్ సినిమాలో కొల్లేరును కాలుష్య కారకంగా, వ్యర్థాలతో చేపలను పెంచుతున్నట్లు చూపించడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

కొల్లేరు సరస్సు విషయంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని వారంతా తేల్చి చెప్పారు. కొల్లేరు గురించి తప్పుగా చిత్రీకరిస్తే మేమంతా ఒక్కటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ‘రిపబ్లిక్’లో కొల్లేరు సరస్సుపై చూపించిన సన్నివేశాల్ని వెంటనే తొలగించకపోతే సినిమాపై సుప్రీం కోర్టుకు వెళ్తామని గ్రామ ప్రజలు తీవ్రంగా హెచ్చరించారు.

సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.