టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 14 మందిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు..ఈరోజు సోమవారం మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు. గండీడ్‌కు చెందిన తిరుపతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఉపాధి హామీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తిరుపతయ్య.. ఏఈ పేపర్‌ను డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య తీసుకుని రాజేంద్ర కుమార్‌కు అమ్మినట్లు దర్యాప్తు లో తేలింది.

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక సొంత మండలం గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందినవాడిగా తిరుపతయ్యను గుర్తించారు. తిరుపతయ్య నుంచి పేపర్ తీసుకున్న రాజేంద్ర కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేయగా.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తిరుపతయ్యను అరెస్ట్ చేయడం జరిగింది. మరోపక్క ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోన్నారు. అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకరి ద్వారా ఒకరు పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.10 లక్షలకు పేపర్ అమ్ముకున్నట్లు విచారణలో వెల్లడైంది.