గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

tspsc-appeal-on-high-court-order-cancelling-group-1-prelims-exam

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ మోషన్‌ అనుమతి కోరుతు పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దీనిపై మంగళవారం విచారిస్తామని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. దీంతో గ్రూప్‌ రద్దుపై హైకోర్టు మంగళవారం విచారించనుంది.

కాగా, ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలతో టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అందులో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. నిరుడు అక్టోబర్‌ 16న తొలిసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్‌ను ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై డివిజన్‌ బెంచ్‌కు స్పష్టత ఇవ్వనున్నది. ప్రిలిమ్స్‌కు హాజరైన 2,33,506 మంది అభ్యర్థుల్లో కేవలం ముగ్గురి కోసం పరీక్షను మళ్లీ వాయిదా వేస్తే మిగిలిన 2,33,503 మంది ఇబ్బంది పడతారని, వారిపై ఆర్థిక భారం పడటంతోపాటు ఎంతో విలువైన సమయం వృథా అవుతుందనే విషయాన్ని ప్రధానంగా ప్రసావించబోతున్నది. గ్రూప్‌-1 ఉద్యోగానికి ప్రిలిమినరీ పరీక్షే ప్రధానం కాదని, మెయిన్స్‌ పరీక్ష కూడా ఉన్నదనే విషయాన్ని బలంగా వినిపించాలని కమిషన్‌ భావిస్తున్నట్టు తెలిసింది.