ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దిమ్మతిరిగే షాక్‌..15 శాతం చార్జీల పెంపు

పెట్రోల్ ధరల పెంపు అన్నింటిపై పడుతుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చుగా..తాజాగా తెలంగాణ ఆర్టీసీ సైతం ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 15 శాతం చార్జీలను పెంచేందుకు చూస్తుంది. గత నెలలో టోల్‌ సెస్, టిక్కెట్‌ ఛార్జీల సవరణ, ప్యాసింజర్‌ సెస్‌ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్‌ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. ఇప్పుడు డీజిల్‌ సెస్‌ పేరుతో మరో వడ్డనకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై నిపుణులతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

ఇదే జరిగితే ప్రయాణికులపై మరింత అదనపు భారం పడే అవకాశముంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దీనికితోడు కరోనా కల్లోలం సృష్టించడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీనినుంచి బయటపడేందుకుగాను మార్చిలో రౌండప్‌ చార్జీలు, టోల్‌ సెస్‌, ప్యాసింజర్‌ సెస్‌ పేరిట 10 శాతానికిపైగా చార్జీలను పెంచింది. ఆర్టీసీకి చమురు సంస్థలు బల్క్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రైవేట్‌ బంక్‌ల నుంచి ఎక్కువ ధర చెల్లించి డీజిల్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇందుకు రోజుకు సుమారు రూ.35-40 లక్షల వరకు సంస్థపై అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత అవసరాలకు రోజుకు రూ.16 కోట్లకు పైగా ఆదాయం సమకూరితేనే ఆర్టీసీ ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉండగా.. రోజుకు రూ.10-12 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కాగా, టికెట్‌ చార్జీలను కనీసం 30-35 శాతం మేరకు పెంచడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో సెస్‌ పేరుతోనైనా కొంత ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.