తెలంగాణ లో నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సిలింగ్‌..

తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి.

కళాశాలల పేర్లు.. కోడ్‌లు ఒకే రకంగా ఉన్నప్పుడు నమోదులో అయోమయానికి గురైతే మంచి కళాశాలకు బదులు నాసి కళాశాలలో సీటు వచ్చే ప్రమాదం ఉంది. బీటెక్‌ సీఎస్‌ఈ బదులు పొరపాటుగా సీఎస్‌సీ అని ఆప్షన్‌ ఇస్తే సైబర్‌ సెక్యూరిటీలో సీటు రావొచ్చు. ఉత్తమ ర్యాంకు వచ్చినా పొరపాట్ల కారణంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు.

రాష్ట్రంలో నేటి నుంచి మూడు విడతల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగే కీలకమని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కళాశాలలు, వాటి ఎంసెట్‌ కోడ్‌లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్‌లను వెబ్‌సైట్‌లో ఉన్న మాన్యువల్‌ ఆప్షన్‌ ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.