మునుగోడు సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై రాజగోపాల్ కామెంట్స్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మునుగోడు లో ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు. ఎప్పటిలాగానే బిజెపి తీరు పట్ల ఘాటుగా స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి కి ఓటు వేస్తే బావుల దగ్గర మీటర్లు ఖాయం అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎవరిని ఉద్ధరించేందుకు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ భూములకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు వద్దన్న కేసీఆర్ కావాలా? మునుగోడు ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటరు పడ్డట్లే అని కేసీఆర్ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీపై పోరాటానికి మునుగోడులో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇది పార్టీల ఎన్నిక కాదని, రైతుల బతుకుదెరువు ఎన్నిక అని పిలుపునిచ్చారు.

కేసీఆర్ వ్యాఖ్యల ఫై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడానికి అపాయింట్‌మెంట్‌ అడిగినా కేసీఆర్‌ ఇవ్వలేదని విమర్శించారు.

కేసీఆర్‌ మాట్లాడేవన్నీ అబద్ధాలేని.. మునుగోడు ఇచ్చే తీర్పుతో కేసీఆర్‌ దిగిపోవడం ఖాయమన్నారు. ఆయన ఎప్పుడైతే ప్రతిపక్షం లేకుండా చేశారో అప్పుడే ఆయన పతనం మొదలైందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. కేసీఆర్‌ అహంకారం వల్లే ఈ ఉప​ ఎన్నిక. ఎమ్మెల్యేలకు అపాయింట్‌ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్‌ అహంకారం కాదా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయని అన్న కేసీఆర్‌ మాటలు అసత్యాలని అన్నారు. బీజేపీకి ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు రావని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తన ప్రాభవం కోసం ఎప్పటికప్పుడు బీజేపీపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.