ఆ మహిళను నేనే ఎప్పుడూ కలవలేదు..నా పిల్లల మీద ప్రమాణం: ట్రంప్

తీర్పు జారీ చేసిన జడ్జిపైనా విమర్శలు

Trump says he never met woman who accused him of rape

వాషింగ్టన్‌ః లైంగిక వేధింపుల కేసులో న్యూయార్క్ జ్యూరీ తనకు వ్యతిరేకంగా జారీ చేసిన తీర్పు విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. రచయిత (మాజీ కాలమిస్ట్) ఇ జీన్ కరోల్ ఓ డిపార్ట్ మెంట్ స్టోర్ లో ఉండగా తనపై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపించగా, కోర్టు వీటిని నిజమేనని తేల్చి 5 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించడం గమనార్హం. 1995-96లో మన్‌హటన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌ డ్రెస్సింగు రూములో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు కరోల్ ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, బూటకమని, పూర్తిగా అబద్ధమని ట్రంప్ వాదించారు. కోర్టు తీర్పు తర్వాత ఓ వార్తా సంస్థకు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు ఏ పాపం తెలియదంటూ ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ఈ మహిళ ఎవరో నాకు తెలియదు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదు. ఆమె ఎవరో కూడా నాకు ఐడియా లేదు. నేను నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నాను. గతంలో నేను ఎప్పుడూ కూడా ఇలా ప్రమాణం చేయలేదు. ఈ మహిళ ఎవరో నిజంగా నాకు తెలియదు. ఇదంతా కట్టు కథ’’ అని ట్రంప్ వార్తా ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతేకాదు సదరు తీర్పు జారీ చేసిన ఫెడరల్ జడ్జిపైనా వ్యాఖ్యలు చేశారు. క్లింటన్ నియమించిన భయంకరమైన జడ్జి అని పేర్కొన్నారు. ఆమె తన ఆరోపణలను నిరూపించేందుకు అన్ని అవకాశాలు కల్పించి, తమకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదన్నారు.