ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం..

వైస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తీవ్రమైన దగ్గుతో బాధపడ్డారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండడంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్స్ ప్రయత్నిస్తున్నారు. భగీరథరెడ్డికి డాక్టర్స్ తొలుత వెంటిలేటర్‌పై 100 శాతం ఆక్సిజన్ ఇచ్చారని, ఇప్పుడు దానిని 60 శాతానికి తగ్గించినట్టు చల్లా భగీరథరెడ్డి బంధువు రఘునాథరెడ్డి తెలిపారు.

భగీరథ రెడ్డి తండ్రి చల్లా రామకృష్ణా రెడ్డి వైస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాగా 2020లో ఆయన ఆకస్మిక మృతితో ఆయన కుమారుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. చల్లా భగీరథరెడ్డి 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా , అవుకు మండలం , ఉప్పలపాడు గ్రామంలో చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేశాడు. చల్లా భగీరథరెడ్డి తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2003 నుంచి 2009 వరకు కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. భగీరథరెడ్డి 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్‌ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా పని చేశాడు. ఆయన తన తండ్రితో పాటు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో 8 మార్చి 2019న వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి భగీరథరెడ్డిని 25 ఫిబ్రవరి 2021న వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశాడు.