ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 208 మంది మృతి

మనీలా: ఫిలిప్పీన్స్​ లో రాయ్‌ తుఫాను విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో తుఫాను వల్ల ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. కాగా, ఆర్చిపెలాగోలోని సౌథర్న్‌, సెంట్రల్‌ రీజియన్లలో సుమారు 239 మంది గాయపడ్డారు, మరో 52 మంది గల్లంతయ్యారని చెప్పారు. కోస్తా ప్రాంతాల్లో మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని ఫిలిప్పీన్స్‌ రెడ్‌క్రాస్‌ తెలిపింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాయ్​ తుఫాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/