టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ ఆచూకీ గల్లంతు!

టైటాన్ జలాంతర్గామితో సముద్రగర్భంలోకి పర్యటన

Titanic tourist submersible: desperate search for sub missing with five onboard

శతాబ్దం కిందట సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ను చూపించేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని సమాచారం. జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.అమెరికా, కెనడాలకు చెందిన కోస్ట్ గార్డ్ లతో పాటు నేవీ సబ్ మెరైన్ లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, జలాంతర్గామి ఎప్పుడు గల్లంతయ్యింది, అందులో ఎంతమంది టూరిస్టులు ఉన్నారనే వివరాలను ఓషియన్ గేట్ కంపెనీ వెల్లడించలేదు.

అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా చిన్నపాటి జలాంతర్గామిని కొనుగోలు చేసి, టైటాన్ అంటూ పేరుపెట్టింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు ఈ జలాంతర్గామిని ఉపయోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది.

ఈ ఐదుగురికి నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ను జలాంతర్గామిలో నింపుతారు. రోజుకు ఎనిమిది గంటల పాటు సముద్ర గర్భంలో తిప్పుతూ, టైటానిక్ శిథిలాలతో పాటు ఇతరత్రా వింతలు చూపిస్తారు. ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి 2,50,000 డాలర్లను కంపెనీ వసూలు చేస్తోంది. అంటే మన రూపాయల్లో.. సుమారు 2 కోట్ల 5 లక్షల రూపాయలు. దీంతో సంపన్నులు మాత్రమే ఈ టూర్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.