వీఆర్ఏల అరెస్టును ఖండించిన రేవంత్ రెడ్డి

వీఆర్ఏలను అరెస్ట్ చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 2020 సెప్టెంబర్ 9న ఇదే అసెంబ్లీలో వారికి పే స్కేల్ ఇస్తాం, పదోన్నతులు ఇస్తామని హామీ ఇచ్చింది మీరే కదా..ఆ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న వీఆర్ఏలను అరెస్ట్ చేయడం ఏంటి అని రేవంత్ ప్రశ్నించారు. వీఆర్ఏలది అర్థం లేని ఆందోళన ఐతే… మీది నరంలేని నాలుకనా కేసీఆర్.. అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో పే స్కెల్ ప్రకారం జీతం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, పే స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని, కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూండడంతో ఇబ్బందిగా ఉందని, ఇతర శాఖలో వీఆర్ఏలను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటన చేయడంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

తమ సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది వీఆర్ఏ లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ప్రస్తుతం వీఆర్ఏల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వీఆర్ఏ సమస్యలను త్వరలోనే తీరుస్తామని , ప్రస్తుతం ఆందోళన విరమించాలని కేటీఆర్ కోరారు. మరి దీనిపై వీఆర్ఏలు ఏమంటారనేది చూడాలి.