మా ఇద్దర్ని ఓడించేందుకు బిఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేస్తుంది – తుమ్మల

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు ప్రచారం చేస్తూ నేతలంతా బిజీ బిజీ గా ఉన్నారు. ఓ పక్క ప్రచారం చేస్తూనే మరోపక్క ప్రత్యర్థి పార్టీ నేతలపై విరుచుకపడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఊపందుకున్నాయి.

ఖమ్మంలో కాంగ్రెస్ నుండి తుమ్మల బరిలోకి దిగగా..బిఆర్ఎస్ నుండి పువ్వాడ బరిలోకి దిగాడు. అలాగే పాలేరు లో కాంగ్రెస్ నుండి పొంగులేటి , బిఆర్ఎస్ నుండి ఉపేందర్ బరిలోకి దిగడం తో ఈ రెండు నియోజకవర్గాల ఫై అందరి కన్ను పడింది. ఈ క్రమంలో తుమ్మల ప్రచారం లో మాట్లాడుతూ..ఖమ్మం నియోజకవర్గం లో తనను… పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు BRS పార్టీ వందల కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపణలు చేశారు. అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉందని… కోట్లు కుమ్మరించి తమ నాయకులు అలాగే కార్యకర్తలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తుమ్మల.

తాము అధికారంలోకి వచ్చాక ఈ అరాచకాలు అన్నిటికీ చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు తుమ్మల. పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. అఫిడవిట్ కు సంబంధించి ఫార్మాట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇంత రస వత్తర పోటీ, ఇంత కసి పట్టుదల ఉన్న ఎన్నికలు చూడలేదన్నారు.