ఎన్నికల సంఘానికి తుమ్మల ఫిర్యాదు

ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత తుమ్మల ఫిర్యాదు చేసారు. ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35 వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని తుమ్మల ఆరోపించారు. ఆ ఓట్లు తొలగించే వరకు ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌తో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్లు కుమ్మక్కై దొంగ ఓట్లు నమోదు చేశారని తన ఫిర్యాదులో ఆరోపించారు.

గతంలో చేసిన తొమ్మిది ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల సమర్పించారు. దొంగ ఓట్ల నమోదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్లు నమోదు చేశారన్నారు. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలన్నారు. ఇంటి నెంబర్ లేకుండా నమోదైన ఓట్లను వెంటనే తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగించిన తర్వాత తుది జాబితాను విడుదల చేయాలని కోరారు.