హమాస్‌ కండిషన్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదుః ఇజ్రాయెల్ ప్రధాని

There is no point in agreement to Hamas conditions: Israeli Prime Minister

జెరూసలెం : హామస్‌తో కాల్పుల విరమణ చర్చలకు ఇజ్రాయెల్ స్వస్తి పలికింది. హమాస్ కండిషన్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పష్టం చేశారు. ‘‘హమాస్ మళ్లీ బయటకు వచ్చి గాజాను తన అధీనంలోకి తీసుకుని, బంకర్లు నిర్మించే పరిస్థితికి మేము అంగీకరించలేము. మా పౌరుల భద్రతను ప్రమాదంలో పడనీయము’’ అని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను కూడా తోసి పుచ్చిన ఆయన.. తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడేందుకు కూడా తాము సిద్ధమని పేర్కొన్నారు. ‘‘ఎలాగైనా మమ్మల్ని అంతం చేయాలనుకుంటున్న శత్రువుతో మేము పోరాడుతున్నాము. అంతర్జాతీయ నేతలకు నేను చెప్పేది ఒకటి. ఏ ఒత్తిడి, అంతర్జాతీయ నిర్ణయాలు, మమ్మల్ని స్వీయరక్షణ చర్యలు తీసుకోకుండా ఆపలేవు’’ అని ప్రకటించారు.

కాగా, హమాస్ ఆకస్మిక దాడితో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన విషయం తెలిసింది. హమాస్ దాడిలో ఇప్పటివరకూ 1,170 మంది మరణించగా వీరిలో అధికశాతం సామాన్య పౌరులే. మరోవైపు ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడిలో గాజాలో 34,683 మంది కన్నుమూశారు. వీరిలో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారని హమాస్ అధీనంలోని భూభాగపు ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరోవైపు, ఖతారీ ప్రధాని ముహమ్మద్ మిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీతో యుద్ధం విషయమై అత్యవసర చర్చలు జరిపేందుకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ దోహాకు వెళ్లారు.

ఇదిలావుంచితే, గాజా యుద్ధాన్ని కవర్ చేస్తున్న అల్ జజీరా ఛానల్‌ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని ఆదివారం ప్రకటించారు. ఆ తరువాత కొద్ది సేపటికే అల్ జజీరా ప్రసారాలు నిలిపివేసింది. ఇజ్రాయెల్ తీరును క్రిమినల్ చర్యలుగా అభివర్ణించిన అల్ జజీరా.. చట్టపరమైన మార్గాల్లో న్యాయం కోసం పోరాడుతామని పేర్కొంది. కాల్పుల విమరణ ఒప్పందంతో సంబంధం లేకుండా రాఫాపై దాడిని ప్రారంభిస్తామని నెతన్యాహు అన్నారు.