మేడిపండులా తయారైన మానవ ప్రపంచం

అసహజమైన పద్ధతులలో అనైతిక ధోరణులు

Human world
Human world

మనపురాణ, ఇతిహాసాలు, వివిధ మతగ్రంథాలు విలు వలతో జీవించడానికి ఎన్నో నిబంధనలు విధించాయి. సత్ప్రవర్తన లేకపోతే సంభవించే విపత్కర పరిణామాలను ఎంతో మంది కవ్ఞలు తమ కావ్యాల్లో చక్కగా విశదీకరించారు.

నాటి నీతి కథలు నేటి తరానికి కంటగింపుగా మారాయి. నీతి ప్రవచనలు విలువలు లేని ప్రపంచంలో వింతగా తయారైనాయి. మేడిపండులాంటి సమాజంలో నీతి అనేది నేతిబీరకాయలో కనిపించని నెయ్యి మాదిరిగా తయారైనది.

నైతిక ప్రవర్తనకు నెలవ్ఞలేదు. సజ్జనత్వానికి చోటు లేదు. విలువలు నశించిన ప్రపంచంలో బతుకీడ్చడం ఆధునికంలో ఆటవికంలా అగుపించ డంలో అతిశయోక్తిలేదు. మానవ మనుగడ సాగాలంటే తక్షణం విలువలకు చోటివ్వాలి. ఆధునిక యుగంలో రాతియుగపు పోకడలు ఊపందుకుంటున్నాయి.

మనిషిని మనిషే వేధించి, వెంటాడి వేటాడే సంస్కృతి ఒక విప్లవంగా చరవేగంతో దూసు కురావడం మానవ పతనానికి మార్గం. విలువలు, బంధాలు కృతిమంగా మారిపోయి,

స్వార్థం పరాకాష్ఠకు చేరుకున్న నేపథ్యంలో మానవ సంబంధాలను పునరుద్ధరించవలసిన తక్షణం అవసరం ఏర్పడింది. పతనం అంచున పరిభ్రమిస్తున్న మానవ జగతిలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిణా మాలను నిరోధించాలి.

ఎవరికోసమో కాలచక్ర భ్రమణం ఆగదు. స్వార్థపరులైన మానవ్ఞలకే గాని ధర్మవర్తనంతో పరిభ్రమించే కాలానికి ఎలాంటి బేధభావాలు ఉండవు. కాలం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరికోసమో క్షణకాలం కూడా ఆగదు. కాలంతోపాటే మానవ జీవన పరిభ్రమణం కూడా సాగక తప్పదు.

ఎన్నో మలుపులు, మరెన్నో కుదుపులు ఎదురైనా ఏటికి ఎదురీదైనా క్రమం తప్పకుండా సాగుతూనే ఉంటుంది. ఎన్నో యుగాలు గడిశాయి. ఎన్నో సంవత్సరాలు మనముందు కు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయి. మానవుడు ఆశావాది.

అనునిత్యం ఆశతోనే బతకాలి. ఏదో మంచి జరుగుతుందనే భావంతోనే జీవితాన్ని నెట్టుకురావాలి. భవిష్య పరిణామాలుతమ జీవితాన్ని మలుపు తిప్పగలవనే ఆశావహదృక్పథంతో బతుకీడ్చ డమే మన ముందున్న కర్తవ్యం. ఏదో ఒక ఆశతో జీవించడం సహజమే.

అయితే ఆత్మాభిమానాన్ని చంపుకుని,ఏదో ఒక రకంగా బతికేయడం మానవ ధర్మానికే అవమానం. ఆత్మాభిమానాన్ని చంపుకుని బతుకు తెరువ్ఞకు అమ్ముకుని బతకడం అత్యంత హేయం. మన వ్యక్తిత్వాన్ని పరులకు తాకట్టుపెట్టి, ఆత్మాభిమా నాన్ని చంపుకుని రాజీ ధోరణితో వికృతంగా జీవించడం కన్నా మౌనమే శరణ్యం.

మౌనమే వేలాది ప్రశ్నలకు సమాధానం చెప్ప గల మహా ఆయుధం. అణ్వాయుధం కంటే బలమైన ఆయుధం మౌనం. నిండుకుండ తొణకదు. వట్టి పాత్రలకే మోతలెక్కువ అంటారు అందుకేనేమో.

ఈ సృష్టిలో మానవుడు బుద్ధిజీవి. మంచి చెడులను ఆలోచించి, తనలోని యుక్తాయుక్త విచక్షణా జ్ఞానానికి పదును పెట్టి సక్రమంగా జీవించగల జ్ఞానసంపద ఈ సకలచరాచర జగత్తులో కేవలం మానవ్ఞలకే ఉంది.

అయితే ఇంతటి జ్ఞానం బూడిదలో పోసిన పన్నీరై, తోటి వారికి, ఇతర జీవరాశుల మనుగడకు ముప్పుగా మారి కంట కన్నీరు పెట్టిం చడం హృదయవిదాకరం.

ఓర్వలేని మనుషుల మధ్య ఓపిక నశించక, దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతుందా? కూసే గాడి దొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు సత్కార్యసాధనాక్రమంలో అలుపెరుగక శ్రమించే కొద్దిపాటి బుద్ధిజీవులను సైతం నిరం తరం విమర్శిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ ఈర్ష్యాద్వేషాలతో రగిలి పోయే కుహనా మేధావ్ఞల మస్తిష్కంలో పేరుకుపోయిన చెదల పుట్టలను ధ్వంసం చేయడం సాధ్యమా?

కాగల కార్యం గంధ ర్వులే తీర్చినట్టు కాలమే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలను వెతికి పెడుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నది మానవ సమాజం. బుద్ధిమంతులెప్పుడూ తమ గతాన్ని వర్తమానానికి అన్వయించుకుని, మంచిచెడుల విచక్షణ గ్రహించి స్థితప్రజ్ఞ్ఞత కనబరుస్తారు.

మన గతం ఏమిటన్న సంగతిని మరచిపోయి తాము జన్నతః మహారాజులమే అన్నట్టుగా అహం కారంతో విర్రవీగుతారు.

మునగకాయలు అమ్మి జీవించిన వ్యక్తికి హఠాత్తుగా ఐశ్వర్యమొస్తే ఆ వంకర టింకర కాయలేమిటని ప్రశ్నించిన చందంగా తమ గతాన్ని, వృత్తిని అవహేళన చేస్తూ బతకడం,అహంకారానికి పరాకాష్ఠ.

గతాన్ని నెమరవేసుకుంటూ, వర్తమానంలో విలువలతో జీవించడమే మానవజీవితానికి సార్ధ కత. ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్ధంగా రూపుదిద్దుకుంటున్నాయి.

డబ్బుచుట్టూ మనిషి పరిభ్రమిస్తూ, భ్రమలోజీవిస్తున్నాడు. స్వార్థం ఆకాశానికంటింది. విలువలు పాతాళానికిఅడుగంటాయి.

అసహజమైన పద్ధతులలో, అనైతిక ధోరణులు తలెత్తిన నేటి సమాజంలో మంచిని వాంఛించడంలో ఆశాభంగం కలగడంలో అతిశయోక్తిలేదు. సంస్కార మెరుగని స్నేహాలు,బంధాలకు విలు వివ్వనిబంధుత్వాలు అవకాశవాదాలు ఆశావహదృక్పథాన్ని చంపేసి, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం చిన్నదైపోయింది. అదేస్థాయిలో మానవ హృదయాలు కూడా కుంచించుకుపోయాయి.

మనిషి సృష్టించిన కరెన్సీమనిషినే ఆటాడించడం ఈవింత ప్రపంచంలోమరోవింత. అవకాశవాద,ఆర్థిక సంబంధాలు మనిషిని శాసిస్తున్న నేపథ్యంలో మనిషి తన మనసుతో మనిషిని మనిషిగా చూసే పరిస్థితి నేడు కానరాదు.

హృదయం లేని మనుషులాడుకునే దమనక్రీడ ప్రాం గణంలో మనసున్న మనుషులెప్పుడూ నిత్య పరాజితులే.ఏ ఎండకా గొడుగు పట్టే వేయినాల్కల విషసంస్కృతిలో మనం గెలవాలనుకోవడం ఓటమి అంచున నిలబడి,ఓడిపోయేయుద్ధానికి సర్వశక్తులొడ్డడమే.

ఇదొక నిష్ఫలప్రయోగమే.అసూయ పురివిప్పి నాట్యం చేస్తున్న నేపథ్యంలో చైతన్యం కొనఊపిరితో కూడా బతకలేదు.ఆధునిక నటనాకౌశల్యం ముందు వాస్తవం కనుమరు గుకాకతప్పదు.గమనించక మోసపోయేవారే నేడు అధికం.

నిలువెల్లా స్వార్థం నిండిన సమాజంలో నిజాయితీకి కించిత్తు స్థానం దక్కడంలేదు.వివేకానికి విలునిచ్చే విచక్షణ మనలో నెలకొనదా? డబ్బు జబ్బు సోకిన సమాజానికి సంస్కారమనే చికిత్సచేయాలి. వివేకంతో కూడిన విలువలకు రూపకల్పన చేయాలి.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/