దేశంలో 15 కోట్ల ఉద్యోగాలు ఆవిరి

యువత భవితపై కరోనా ప్రభావం

Corona effect on youth future
Corona effect on youth future

ఆర్థిక వ్యవస్థ కుదేల యింది. వైరస్‌ ప్రభావం వల్ల అన్ని రంగాలపై పడ్డట్టే ఉద్యోగ అవకాశాలపైనా పడింది. కొత్త ఉద్యోగాల కల్పనపై ఆశలు వదులుకునే పరిస్థితులున్నాయి.

ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే కరోనా సమయంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 కోట్ల 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.

ఇది చాలా పెద్ద లెక్క. ఈ విషయాన్ని తాజాగా సిడ్నీకి చెందిన ‘ప్లోస్‌వన్‌ అనే రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. ఇది మనకు అత్యంత ఆందోళన కరమైన విషయం.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాల్లో వ్యాపారాలు మూతపడ్డాయి.

ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఉద్యోగాల కోతలు, పనిచేసిన రోజులకే వేతనం లాంటి నిర్ణయాలను కంపెనీలు అమలు చేస్తున్నాయి.

కొన్ని సంస్థలైతే కొంతకాలం పాటు నియామకాలను వాయిదా వేసుకుంటున్నాయి. ప్రముఖ ఉద్యోగ వెబ్‌సైట్‌ ఇన్‌డీడ్‌ కూడా ఇటీవల ఒక నివేదిక రూపొందించింది.

ఈ నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే జూన్‌ మధ్యనాటికి భారత్‌లో నియామకాలు 51 శాతం తగ్గాయని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే బ్రిటన్‌లో నియామకాలు 60 శాతం, మెక్సికో సహా మరికొన్ని ఐరోపా దేశాల్లో 61 శాతం చొప్పున క్షీణించాయి.

అమెరికాలో 29 శాతం, సింగపూర్‌లో 32 శాతం, ఆస్ట్రేలియాలో 42 శాతం మేర నియామకాలు తగ్గాయి. కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా అంతర్జాతీయంగా 3.8 ట్రిలియన్ల ఉత్పత్తిని ఆయా కంపెనీ యాజమాన్యాలు నష్టపోయాయి.

పర్యాటకరంగం దారుణంగా దెబ్బతింది. తయారీ రంగం, రవాణా రంగాలు సైతం రోజురోజుకూ తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాయి.

సెప్టెంబరు, డిసెంబర్‌ మధ్యలో వైరస్‌ రెండో దశ మొదలు కానుందని ఇటీవల అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సట్‌ వెల్లడించడం మరిన్ని భయాలను పెంచుతోంది.

ఈ నేపథ్యంలో కొత్త ఉద్యోగాల నియామకాలు జరగాలన్నా, ఉన్న ఉద్యోగాలు కాపాడుకోవాలన్న వైరస్‌ ఉధృతి తగ్గడం, మినహా మరో మార్గం కనిపించడం లేదు.

  • శ్రీనివాస్‌గౌడ్‌ ముద్దం

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/