రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ముఖ్యమంత్రి అల్పాహార పథకం

The Chief Minister’s Breakfast Scheme started across the state

రంగారెడ్డి: తెలంగాణలో ఈరోజు ముఖ్యమంత్రి అల్పాహార పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్‌ స్కూల్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో లిసి మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. వారితో కలిసి టిఫిన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కెటిఆర్‌ ఈ కర్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల కలిసి టిఫిన్‌ చేసిన మంత్రి.. రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

కాగా, రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ వల్ల రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ప్రతిరోజు స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేస్తారు.