సంక్షోభంలో భవన నిర్మాణ రంగం

జిఎస్‌టి పెరుభారం

Construction Sector
Construction Sector

జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో నిర్మాణ రంగం గత రెండేళ్లుగా చతికిలపడింది. భవన నిర్మాణాలలో 28శాతం మందగమనం నమోదు అయిందని, ఫిక్కీ, నేషనల్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌లు ఇటీవలి నివేదికలో తెలియ చేశాయి.

ఈ రంగంలో వృద్ధి క్షీణత కారణంగా దేశం మొత్తం మీద నాలుగు కోట్ల భవన నిర్మాణ కార్మికుల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి.

అయితే గోరు చుట్టుపై రోకలి పోటులా మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్‌డౌన్‌ వారిపై మరింత ఒత్తిడిని పెంచింది.

పనులు లేక కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. అయితే వీరికి వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పునరావాస కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు రాష్ట్రాలలో గ్రీన్‌జోన్‌లలో పనులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది.

అయినా ఈ రంగం పుంజుకోవడం లేదు. తగు జాగ్రత్తలతో కార్మికులు పనులలోకి వెళ్లేందుకు సంసిద్ధం అయినా నిర్మాణ దారులు మాత్రం పనులు ప్రారంభించడం లేదు.

లాక్‌డౌన్‌, గత ఆర్నేళ్లుగా మందగొడితనం కారణంగా ఫిబ్రవరి నుండి సిమెంటు ధర లు 30 శాతం పెరిగిపోయాయి.

ప్రస్తుతం సిమెంట్‌ బస్తా ధర రూ. 450 పలుకుతోంది. ఇంత ధరలతో సిమెంటు కొనుగోలు చేయలేక పట్టణాలు, నగరాలలోనే కాక గ్రామాల లో చిన్న చిన్న నిర్మాణాలు కూడా ఆపివేయడం వలన కార్మికులకు ఉపాధి లేకుండాపోయింది.

అలాగే ఇటుక, ఇసుక ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రభుత్వ నిర్దేశిత ధరల కంటే ఎక్కువ చేసి ఇష్టారాజ్యాంగా అమ్ముతున్నారు.

కాబట్టి భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేందుకు కోట్లాది కార్మికుల జీవితాలలో వెలుగునింపేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం పునరావాస కార్యక్రమాలను చేపట్టాలి.

కార్మికులకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో వచ్చే మూడు నెలలో ఉచిత రేషన్‌తోపాటు విద్య,వైద్య, సౌకర్యాలు కల్పించాలి. పింఛను కింద నెలకు రెండువేల రూపాయలు అందించాలి.

నిర్మాణాలు జోరందుకునేలా సిమెంట్‌, ఇసుక, ఇటుక ధరలను నియంత్రించాలి. భవన నిర్మాణాలపై జిఎస్టీను తగ్గిస్తే వినియోగదారులకు వెసులుబాటు కలుగుతుంది.

  • సి.ప్రతాప్‌

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/