జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

Terrorist killed in encounter in Jammu and Kashmir’s Pulwama

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు చనిపోయాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు. అతడు ఏగ్రూప్‌కు చెందినవాడనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని చెప్పారు.

కాగా, పుల్వామాలో కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదుల కాల్చి చంపిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. పుల్వామా జిల్లాలోని అచన్‌కు చెందిన సంజయ్‌ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి స్థానిక మార్కెట్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు ఆయనను ఛాతిపై కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించేలోపే ప్రాణం పోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 నుంచి 9 మంది పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారని స్థానికులు చెప్పారు.