ఇబ్రహీంపట్నం ఘటనఫై రేవంత్ ఫైర్..బాధితులకు కోటి ఇవ్వాలని డిమాండ్

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ ఘటన ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని..చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేసారు. చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని చేసుకోలేని పరిస్థితి ఉన్న క్రమంలో.. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా.. సీఎం కేసీఆర్ రివ్యూ చేయలేదని విమర్శించారు. గంటలో 34 మందికి ఆపరేషన్ చేశారని.. ప్రతి 2 నిమిషాలకు ఒక్కో ఆడపడుచుకు ఆపరేషన్ చేశారన్నారు. నిర్లక్ష్యం వల్ల.. సరైన వసతులు లేకపోవడం వల్ల నలుగురు ఆడపడుచులు చనిపోయారన్నారు.

ప్రస్తుతం ఉన్న వారి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు అర్థమౌతోందన్నారు. విపత్కరమైన పరిస్థితులుంటే… పర్యవేక్షించడానికి ఒక్క అధికారి లేడన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీల ఆసుపత్రులకు తరలించకుండా.. కార్పొరేట్ హాస్పిటల్స్ కు తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు ? చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.