జనసేన సభకు భూములిచ్చారన్న కక్షతోనే కూల్చివేశారన్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్

ఇప్పటం లో ఇళ్ల కూల్చివేత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. జనసేన సభకు భూములిచ్చారన్న కక్షతోనే అధికార పార్టీ ఇళ్లులు కూల్చారని ప్రతిపక్షపార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం లో పర్యటించి ఇళ్లులు కోల్పోయిన వారికీ అండగా నిలిచారు.

ఇక ఇదిలా ఉంటె టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇప్పటం ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని రోడ్లపై ఉన్న గుంతల్ని పూడ్చలేని వైస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లు కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. శనివారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పటంలో 120 అడుగులు రోడ్దు విస్తరణ చేయమని ఎవరడిగారు? అంటూ నిలదీశారు. జనసేన సభకు భూములిచ్చారన్న కక్షతోనే ఒక సామాజికవర్గం వారి ఇళ్లు కూల్చారని ఆరోపించారు.

“మీకు చేతనైనే రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చండి. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ముఖ్యమంత్రికి తెలియదా? గుంతల్లో పడి వైసీపీ కార్పోరేటర్ చనిపోయింది వాస్తవం కాదా?” అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణ పనులు జరగకుండా కోర్టుకెళ్లిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మారుమూల గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చటం ఏంటి? అని శ్రావణ్ కుమార్ నిలదీశారు. నువ్వు ప్రజలకు మొహం చాటేయటం తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి? అంటూ మండిపడ్డారు.