నిశ్శబ్దంగా మారిన మునుగోడు

,

మొన్నటి వరకు మునుగోడు లో ఎటు చూసిన సందడి వాతావరణం నెలకొని ఉండే..గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వాహనాలు , పోలీసులు , నేతలు , కార్య కర్తలు , డప్పుల సౌండ్ , పాటలు , నాట్యాలు వామ్మో ఇలా ఏంచెప్పిన తక్కువే. సందడి అంత మునుగోడు లోనే ఉండేది. ఎక్కడ చూడు కాలు పెట్టె సందడి లేకుండా ఉండే. టి కొట్టు దగ్గరి నుండి ఫైస్టార్ హోటల్ వరకు జనాలతో కిక్కిరిపోయాయి. ఇక వైన్ షాప్స్ , హోటల్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క అక్టోబర్ నెలలోనే రూ.300 కోట్ల మద్యం వ్యాపారం సాగిందంటే అర్ధం చేసుకోవాలి. ఆలా సందడి..సందడి గా ఉన్న మునుగోడు..ఒక్కసారిగా నిశ్శబ్దం గా మారింది.

జనసంచారం ఒక్కసారిగా మాయమైంది. నిన్న మొన్నటి వరకు కిటకిటలాడిన దుకాణాలు ఇప్పుడు వెలవెల బోతున్నాయి. రోజూ పెద్ద ఎత్తున గిరాకీ జరిగిన షాపులకు గిరాకీ ఒక్కసారిగా పడిపోయింది. కౌంటర్ లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నిక మూలాన తమ వ్యాపారాలు మాత్రం బాగా సాగాయని వ్యాపారస్తులు చెపుతున్నారు. ఏడాది లో సంపాదించిందానికంటే ఎక్కువ ఈ నెల రోజుల్లోనే సంపాదించామని చెపుతున్నారు. ఇక ఇళ్ల అద్దెల ద్వారా కూడా బాగా వచ్చాయని అంటున్నారు. నెలకు వెయ్యి కూడా అద్దె లేని దగ్గర రూ. 20 వేలు ఇచ్చారని చెపుతున్నారు. మొత్తం మీద ఉప ఎన్నిక వల్ల నేతలేమో కానీ కార్య కర్తలు , మునుగోడు వాసులు బాగా లాభపడ్డారు.

ఇక రేపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రాబోతున్నాయి. నల్లగొండ టౌన్‌లోని అర్జాల‌బావి దగ్గర వేర్ హౌసింగ్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియలో 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూప‌ర్‌వైజ‌ర్, అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్, మైక్రో అబ్జర్వర్‌ల‌ను నియ‌మించారు. మొత్తం 298 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలలో లెక్కిస్తారు. ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే ఛాన్స్‌ ఉంది. చివరి ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే అవకాశం ఉంది. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వ‌చ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్లను లెక్కిస్తారు. మొదట చౌటుప్పల్‌ మండలంలోని ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఈవీఎంలను టేబుళ్ల వద్దకు తరలిస్తారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అధికారులకు మూడు దఫాలుగా అధికారులు శిక్షణ ఇచ్చారు. ఇక కౌంటింగ్‌ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.