తెలుగు రాష్ట్రాల్లో సాధారణ స్థితికి ఉల్లి ధర

సంక్రాంతి పండుగ నాటికి ఇంకా మెరుగున పడే అవకాశం

Onions
Onions

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు దిగి వస్తున్నాయి. సంక్రాంతి పండుగ నాటికి రెండు రాష్ట్రాల్లో ఉల్లిధరలు ఊరటనిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా ఉల్లిని చూసి బెంబేలెత్తిన సామాన్యుడికిది శుభవార్తనే చెప్పాలి. ఉల్లికోసం ప్రజలు రైతు బజార్లలో పెద్దపెద్ద క్యూలు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో కూడా ఉల్లి వినియోగాన్ని ఆపేశారు. ఇక ఉల్లిని కొనలేం, తినలేం అన్నట్లుగా మారింది ప్రజల పరిస్థితి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రానికి రావాల్సిన సరుకు దిగుబడి అమాంతం తగ్గిపోయింది. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పంట డిమాండ్‌క తగ్గట్లు లేకపోవడంతో ఒక దశలో ఉల్లిని కిలో రూ. 200 పలికింది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉల్లి క్వింటాల్‌ రూ. 5 వేలకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లలో రూ. 60 వద్ద అమ్ముడవుతుంది. మరో రెండు మూడు రోజుల్లో ఉల్లి ధర రూ. 30 దిగి వస్తుందని, సంక్రాంతి నాటికి రూ.20 కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు అంటున్నారు. స్థానిక పంటలు అందుబాటులోకి రావడం, మహారాష్ట్ర నుంచి దిగుమతి, ఈజిప్టు నుంచి కేంద్రం కూడా భారీ మొత్తంలో ఉల్లి దిగుమతులు చేసుకోవడంతో ఉల్లి ధర తగ్గడానికి అవకాశం దొరికింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/