డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణా నెంబర్ వన్ గా ఉందిః మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క డిగ్రీ కాలేజీ కోసం సిరిసిల్ల, వేములవాడ మధ్య గొడవ జరిగిందని.. అరవై ఏండ్ల పాలనలో ఒక్క డిగ్రీ కాలేజ్ కోసం లొల్లి అయిందన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో, సిరిసిల్లలో విద్యా, వైద్యం విషయంలో అగ్రస్థానంలో వుందన్నారు. డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణా నెంబర్ వన్ గా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
ప్రతీ వందమంది డాక్టర్ లలో 43 మంది తెలంగాణాలో తయారు అవుతున్నారని అన్నారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కు అనే స్థితి నుంచి సర్కార్ దవాఖానలో మాత్రమే ప్రసవం అయ్యే స్థితికి వచ్చామన్నారు. ఒక్క డాక్టర్ పోస్ట్ కోసం అడుక్కునే స్థితి నుంచి జిల్లాకు 100 కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్ లు అందుబాటులోకి వచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 2 కాలేజీలు మాత్రమే కట్టారని.. 9 ఏండ్ల తెలంగాణలో 28 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు.
కాంగ్రెస్, బిజెపిలే తెలంగాణ వెనకబాటుకు కారణమని కెటిఆర్ మండిపడ్డారు. తిరిగి వారు ఇప్పుడు అధికారం ఇవ్వమంటున్నారని దుయ్యబట్టారు. తాను సిరిసిల్లలో ఒక్క రూపాయి పంచను, ఒక్క చుక్క మద్యం పంపిణీ చేయను అని చెప్పానని.. అదే మాటకి కట్టుబడి వున్నానన్నారు. సిరిసిల్ల ప్రజలకు తెలుసు నేనేం చేసానో.. వారిపై నాకు నమ్మకం ఉందన్నారు. అందుకే ప్రతిజ్ఞ చేసానన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి కెసిఆర్ ని ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు.