503 పోస్టులతో గ్రూప్​ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు వరుస పెట్టి తీపి కబుర్లు తెలుపుతుంది తెలంగాణ సర్కార్. మంగళవారం 503 పోస్టులతో గ్రూప్​ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ). టీఎస్పీఎస్పీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2018నాటి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు 95శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు.

ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 38 భర్తీ చేయనున్నది. అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ 20 (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్), డీఎస్పీ 91, జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు 2, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ 8, జిల్లా ఉపాధి అధికారి 2, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు 6, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు 35 భర్తీ చేయనున్నది. వీటితో పాటు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి 121, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు 5, సీటీఓ 48, డిప్యూటీ కలెక్టర్లు 42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు 4, జిల్లా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు రెండింటిని భర్తీ చేయనున్నది.

ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 2 నుండి మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ స్వీకరించనున్నది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్ వన్ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మొదట టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇంతకు ముందే ఓటీఆర్‌ చేసుకున్నవారు అప్‌గ్రేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.