ఇక నుండి బీసీ విద్యార్ధులకు కూడా పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందిః మంత్రి గంగుల

Telangana Govt to pay full fee for BC students who get admissions into 200 premier institutions

హైదరాబాద్‌ః రాష్ట్రంలోని బీసీ విద్యార్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన రాష్ట్ర బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలు అవుతుందని మంత్రి తెలిపారు.

కాగా, గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అవకాశం ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీ విద్యార్థులకూ వర్తింపజేస్తామని, ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.150 కోట్ల భారం పడనుంది. ఇప్పటి వరకూ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ అందిస్తు్న్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలోనూ ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ చెల్లించనున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి గంగుల తెలిపారు.