డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..రెండో రోజుల్లో కొత్త నోటిఫికేషన్

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియామకాలకు గత ఏడాది బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. గత సెప్టెంబర్ నెలలో 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన తాజా ప్రభుత్వం మెగా డీఎస్సీకి సిద్ధమైంది. ఇప్పుడు ఉన్న 5,089 పోస్టులకు తోడు మరిన్ని పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఈ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పేరిట ప్రెస్ నోట్ విడుదల అయింది. రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపింది. క్రితంసారి దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని… వారి దరఖాస్తులు ఆటోమేటిక్‌గా క్యారీ ఫార్వార్డ్ అవుతాయని తెలిపింది.