‘బలగం’ మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం సాయం

‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ‘తోడుగా మా తోడుండి’ అనే పాట ప్రతీ ఒక్కరిని కన్నీరుపెట్టిస్తుంది. ఈ పాటే సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టి కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి చాల దారుణంగా ఉంది. కరోనా తర్వాత ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తర్వాత కళ్లు కూడా కనిపించట్లేదు. వైద్యం చేయించుకునేందుకు మొగిలయ్య ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. షుగర్, బీపీ వల్ల వైద్యం చేయడం క్రిటికల్ గా మారింది. ఇప్పటికే 10 ఆపరేషన్లు జరిగాయి. దీంతో మొగిలయ్య పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎవరైన సాయం చేయాలనీ కుటుంబ సభ్యులు కోరడం తో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.

గాయకుడు మొగలియ్య ఆరోగ్యానికి కావాల్సిన వైద్యానికి పూర్తి ఖర్చును ప్రభుత్వం పూర్తి ఉచితంగా జరిపించనున్నట్లు ప్రకటించింది. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆయన వైద్య సహాయ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫోన్ చేసి మరి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో మొగలియ్యను నిమ్స్ ఆస్పత్రికి తరలించనున్నారట. అలాగే మొగిలయ్యకు బలగం సినిమా డైరెక్టర్, కమెడియన్ వేణు యెల్దండి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. అలాగే త్వరలో అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి కూడా మొగిలయ్యకు ఆర్థిక సాయం అందనుందని సమాచారం.