27 లేదా 29 నుంచి మరో రెండు గ్యారంటీల అమలుపై దృష్టి

telangana-government-has-finalized-the-date-for-the-implementation-of-grihajyothy-and-gas-cylinder-scheme-for-rs 500

హైదరాబాద్‌ః ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టిసారించిన తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలకమైన హామీల అమలుకు సిద్ధమైంది. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు ఉద్దేశించిన ‘గృహజ్యోతి’, రూ.500లకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను ఈ నెల 27 లేదా 29 తేదీల్లో ఆరంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పథకాల అమలుకు తక్షణమే సన్నద్ధమవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. మార్చి నెల మొదటి వారం నుంచి ‘జీరో’ కరెంట్ బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు.

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన లబ్దిదారులకు అందరికీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించాలని పేర్కొన్న ముఖ్యమంత్రి, సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ సాధ్యాసాధ్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా అనుకూల విధానాన్ని అవలంబించాలని, అవసరమైతే గ్యాస్‌ ఏజెన్సీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక తెల్ల రేషన్‌కార్డు ఉండి నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడేవారందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుల్లో ఎవరైనా రేషన్ కార్డు లేదా ఇతర వివరాలు పొరపాటుగా నమోదు చేసి వుంటే కనుక వారికి సరిచేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు. తప్పులను సవరించుకున్న వారికి తదుపరి నెల నుంచి ఉచిత విద్యుత్‌ పథకాన్ని వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం ప్రతి గ్రామంలో ప్రజలందరికీ తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.

గురువారం సచివాలయంలో జరిగిన ఈ కీలక మంత్రివర్గ ఉపసంఘంల భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, ట్రాన్స్‌కో- జెన్‌కో సీఎండీ రిజ్వీ, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.