గౌతమిపుత్ర – రుద్రమదేవి నిర్మాతలకు సుప్రీం కోర్ట్ షాక్ ..

‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి ‘ నిర్మాతలకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వాల నుంచి వినోదపు పన్నును రాయితీగా పొందిన ఈ రెండు సినిమాలు దాని తాలూకు ఫలాలను ప్రేక్షకులకు పంచకపోవడంపై సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు సినిమాల నటులు దర్శకులు నిర్మాతలకు తాజాగా నోటీసులు జారీ చేసింది. సినిమాకు పన్ను రాయితీ తీసుకొని టికెట్ రేటు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని అందులో పేర్కొంది. పన్ను రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.

సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్ర చూడ్ ధర్మాసనం విచారించింది. ఈ మేరకు నందమూరి బాలకృష్ణతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. రెండూ చారిత్రాత్మక చిత్రాలు కావడం వల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.