తమ్మినేని కృష్ణయ్య పాడె మోసిన తుమ్మల..

ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం తెల్దారుప‌ల్లి గ్రామ స‌మీపంలో టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ్మినేని కృష్ణ‌య్య దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మండ‌ల ప‌రిధిలోని పొన్నెక‌ల్ రైతు వేదిక వ‌ద్ద జాతీయ జెండాను ఎగురవేసిన.. కృష్ణ‌య్య అనంతరం తెల్దారుప‌ల్లికు తిరిగి వ‌స్తుండ‌గా.. కృష్ణ‌య్య‌పై దుండ‌గులు వేట కొడ‌వ‌ళ్లు, గొడ్డ‌ళ్లు, క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. దీంతో అక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

ఈయన అంత్యక్రియలు ఈరోజు జరిగాయి. తమ్మినేని కృష్ణయ్య అంతిమయాత్రలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తమ్మినేని కృష్ణయ్య పాడె మోశారు. తన అనుచరుడికి తుది వీడ్కోలు పలుకుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్ర కొనసాగిన దారి పొడవునా.. అభిమానులు నినాదాలు చేశారు. అంతిమయాత్ర సందర్భంగా.. పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెల్దారుపల్లి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. రాజకీయ కక్షతో వీరభద్రం, ఆయన సోదరులే ఈ హత్య చేయించారని కృష్ణయ్య కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. తన తండ్రి హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు, మరో ఆరుగురు కారకులని పేర్కొంటూ కృష్ణయ్య కుమారుడు నవీన్‌ ఖమ్మం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ హత్యోదంతంతో కోపోద్రిక్తులైన కృష్ణయ్య బంధువులు, కుటుంబీకులు, అనుచరులు..వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు, అనుమానితుల ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. గ్రామానికే చెందిన బోడపట్ల శ్రీను (తండ్రి చిన్న ఎల్లయ్య), గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బండ నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడినట్లు కృష్ణయ్య కారు డ్రైవ‌ర్ కే ముత్తేశం చెపుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.