వికారాబాద్ లో సీఎం కేసీఆర్ కు నిరసన సెగ

వికారాబాద్ పర్యటన లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిరసన సెగ ఎదురైంది. రాష్ట్ర అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్ నాయక్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద సీఎం గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఇక్కడకు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలియచేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్బంగా రాఘవన్ మీడియాతో మాట్లాడుతూ… 12 వందల మంది ఆత్మబలిదానం చేసుకుంటే రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తు చేశారు. సీఎం అయిన తర్వాత.. కేసీఆర్ హామీలను విస్మరించారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్లు హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. నిరసన తెలియచేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక కెసిఆర్‌ వికారాబాద్ పర్యటనలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. పార్టీ ఆఫీసుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్క‌డ టీఆర్ఎస్ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం రిబ్బ‌న్ క‌ట్ చేసి కార్యాల‌యంలోకి వెళ్లారు. పార్టీ ఆఫీసు లోప‌ల సీఎం ప్ర‌త్యేక పూజ‌లు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వ‌ర్ రెడ్డి, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.