తూత్తుకుడి లేదా పుదుచ్చేరి నుంచి త‌మిళిసై పోటీ..?

tamilisai competition from Thoothukudi or Puducherry..?

న్యూఢిల్లీ : తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న రాజీనామా లేఖ‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు ఆమె పంపారు. అయితే 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మిళిసై బీజేపీ త‌రపున పోటీ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని తెలుస్తోంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి కూడా త‌మిళిసై రాజీనామా చేశారు.

అయితే త‌మిళిసై ఏ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళ‌నాడులోని చెన్నై సెంట్ర‌ల్ లేదా తూత్తుకుడి నుంచి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక పుదుచ్చేరి నుంచి కూడా ఆమె పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తూత్తుకుడి ఎంపీ స్థానానికి ఆమె పేరు ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం డీఎంకే నాయ‌కురాలు క‌నిమొళి పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక‌ పుదుచ్చేరి ప్ర‌జ‌ల‌తో కూడా త‌మిళిసైకి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబ‌ట్టి ఆమె తూత్తుకుడి లేదా పుదుచ్చేరి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2006లో రాధాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేశారు. కానీ గెల‌వ‌లేదు.