అవినీతి కేసు..తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్లు జైలు శిక్ష

2006-2011లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ పొన్ముడిపై కోర్టుకెక్కిన అన్నాడీఎంకే

tamil-nadu-minister-ponmudy-sentenced-to-3-years-in-jail-in-corruption-case

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత కె.పొన్ముడికికి మద్రాస్ హైకోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో శిక్షను తగ్గించాలని కోరుతూ పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించారు. మంత్రి వయసు 73 సంవత్సరాలు, ఆయన భార్య వయసు 60 ఏళ్లని, కాబట్టి శిక్షను తగ్గించాలని కోరారు. పొన్ముడికి సాధారణ జైలుశిక్ష, ఆయనకు, ఆయన భార్యకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కాగా, శిక్షను పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది.

రూ.1.75 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడి, ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రెండు రోజుల క్రితం కొట్టేసిన హైకోర్టు వారిని దోషులుగా ప్రకటించి శిక్షపై తీర్పును వాయిదా వేసింది. తాజాగా, ఈ ఉదయం తీర్పు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఉన్నత విద్యాశాఖను వేరొకరికి అప్పగించనున్నారు. ఈ కేసు 2006-2011 హయాం నాటిది. అప్పట్లో పొన్ముడి రూ.1.36 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్టు 2011లో అన్నాడీఎంకే నేత కోర్టుకెక్కారు.