ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి

ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా పూర్తి అయ్యింది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఏర్పటు చేసిన వేదిక ఫై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకలో జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేయగా. చివరగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ప్రమాణం చేసారు.

రాంబాబు తర్వాత అంజాద్‌ బాషా (కడప), ఆదిమూలపు సురేశ్‌ (ఎర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాల నాయుడు(మాడుగుల)తో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా (తుని), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), గుడివాడ అమర్‌నాథ్‌ (అనకాపల్లి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుమ్మనూరు జయరామ్‌ (ఆలూరు), జోగి రమేశ్‌ (పెడన), కాకాణి గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి), కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), నారాయణస్వామి (గంగాధర నెల్లూరు), ఉష శ్రీచరణ్‌ (కల్యాణదుర్గం), మేరుగు నాగార్జున (వేమూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పినిపె విశ్వరూప్‌ (అమలాపురం), పీడిక రాజన్నదొర (సాలూరు), ఆర్కే రోజా(నగరి), సీదిరి అప్పలరాజు(పలాస), తానేటి వనిత (కొవ్వూరు), విడదల రజని (చిలకలూరిపేట).. మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన కేబినెట్‌లో పాత మంత్రులను 11 మందిని కొనసాగించగా.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు.

సరిగ్గా 34 నెలల రెండు రోజులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. అధికారం చేపట్టిన కొత్తలోనే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తానని సీఎం బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు.