నేడు యాదాద్రికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి రాక

ఈరోజు మంగళవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి రాబోతున్నారు. స్వరూపానందేంద్రతోపాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శంషాబాద్‌ నుంచి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి స్వరూపానందేంద్ర స్వామి చేరుకొంటారు. ఉదయం 10:45 గంటలకు స్వయంభువులను దర్శించుకొంటారు. 11 గంటలకు నారసింహ క్షేత్రాన్ని, 11:50కి యాదమహర్షి విగ్రహాన్ని సందర్శిస్తారు.

మరోపక్క శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 20 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత ఒక ప్రకటనలో తెలిపారు. శివాలయ ప్రతిష్ఠ, ఉపదేవీ, దేవతల ప్రతిష్ఠ, పంచకుండాత్మక పాంచాహ్నిక దీక్షా విధానంతో సుమారు 54 మంది ఆచార్య బ్రహ్మ వేద పారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్‌, పరిచారక బృందంతో మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 25న ఉదయం 10:25 గంటలకు ధనిష్ట నక్షత్ర యుక్త మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తాన తొగుట పీఠాధీశ్వరుడు మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు.