రోడ్డు ప్రమాదానికి గురైన మాజీ చైర్మన్ స్వామి గౌడ్

బీజేపీ పార్టీ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌ బండ్లగూడ చౌరస్తాలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో గాయపడ్డ స్వామిగౌడ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయ్యిందని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకే రోడ్లపై గుంతలు ఏర్పడటం వల్లే తనకు ప్రమాదం జరిగిందని స్వామిగౌడ్ చెబుతున్నారు. బండ్లగూడ చౌరస్తా నుండి మోటర్ సైకిల్ పై కిస్మత్ పూర్ లోని తన ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

స్వామి గౌడ్ విషయానికి వస్తే.. 1954, జూలై 5న నర్సమ్మ, లక్ష్మయ్య దంపతులకు జన్మించాడు. బీఎస్సీ వరకు చదివాడు. 1969 ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, బుల్లెట్ గాయానికి గురయ్యాడు. 1977లో దివిసీమలో వరదలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లి ప్రజలకు సహకారం అందించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో నాయకుడుగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా కీలకభూమిక పోషించడంతోపాటు, ప్రభుత్వోద్యోగులు చేసిన 42 రోజుల సమ్మెకు సకల జనుల సమ్మెగా పేరు పెట్టి ముందుండి నడిపించాడు.

2012 జూలైలో పదవీ విరమణ చేసి, నవంబరులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించబడ్డాడు. కరీంనగర్ జిల్లా పట్టభద్డుల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసన మండలికి ఎన్నికయ్యాడు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో 2014, జూలై 2న తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన 2017లో గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. ఆయన శాసనమండలి ఛైర్మన్‌గా 2 జూలై 2014 నుండి 29 మార్చి 2019వరకు పని చేశాడు. స్వామి గౌడ్ 25 నవంబర్ 2020న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.